Mercedes-Maybach SL 680: అల్ట్రా-లగ్జరీ కన్వర్టిబుల్ రోడ్‌స్టర్.! భారత్ లోకి.. 12 d ago

లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ (Mercedes-Benz)..భారతీయ మార్కెట్లోకి తన అత్యంత ప్రత్యేకమైన అల్ట్రా లగ్జరీ బ్రాండ్ మెర్సిడెస్-మేబ్యాక్ SL 680 (Mercedes-Maybach SL 680) మోనోగ్రామ్ సిరీస్‌ను విడుదల చేసింది. ఈ లగ్జరీ రోడ్‌స్టర్ సుమారు రూ. 4.2 కోట్ల (ఎక్స్-షోరూమ్) ధరతో విడుదల చేసినట్లు తెలుస్తుంది. ఈ కారును 2024 లో మొదటిసారిగా ప్రదర్శించారు. ఇది మేబ్యాక్ (Maybach) బ్రాండ్‌లో ఇప్పటివరకు వచ్చిన వాటిలో అత్యంత స్పోర్టీ కారు. ఇప్పటికే ఈ కార్ బుకింగ్‌లు మొదలయ్యాయి. కానీ, ఈ ఏడాది కేవలం మూడు కార్లను మాత్రమే అమ్మాలని కంపెనీ నిర్ణయించింది.
ఆకర్షణీయమైన రూపం (Exterior):
మెర్సిడెస్ మేబ్యాక్ SL 680 మోనోగ్రామ్ సిరీస్ చూడటానికి చాలా అందంగా ఉంది. ఇది రెండు ప్రత్యేకమైన రంగులలో లభిస్తుంది: 'రెడ్ యాంబియన్స్' (Red Ambience) మరియు 'వైట్ యాంబియన్స్' (White Ambience). ఈ మోడల్ ను AMG SL 63 కారు ఆధారంగా రూపొందించారు. మేబ్యాక్ శైలిలో ప్రత్యేకమైన హుడ్, మెరిసే గ్రిల్, కొత్తగా డిజైన్ తో కూడిన ముందు భాగం దీనికి AMG SL మోడల్ నుండి ప్రత్యేకతను తెస్తాయి. కొనుగోలుదారులు తమకు నచ్చిన లోగోలను సాఫ్ట్-టాప్ రూఫ్‌పై ముద్రించుకునే అవకాశం కూడా ఉంది.
21-అంగుళాల ప్రత్యేక చక్రాలు, క్రోమ్ అలంకరణలు దీనికి మరింత అందాన్ని ఇస్తాయి. దీని వీల్ ఆర్చ్‌ల పొడవునా సొగసైన క్రోమ్ స్ట్రిప్ ఉంటుంది. ఇలా మొత్తం ఒక వీల్‌లో 5 క్రోమ్ స్ట్రిప్స్ ఉంటాయి. దీని డోర్ హ్యాండిల్స్, ఫ్రంట్ ఫెండర్లపై కూడా క్రోమ్ ఉంటుంది. అలాగే వెనుక భాగంలో క్రోమ్ బంపర్.. ఈ కారుకు విలాసవంతమైన రూపాన్ని అందిస్తాయి. ఇన్ని ఉన్నా కాని వెనుక భాగం రోడ్‌స్టర్‌తో పోలిస్తే కొంచెం తక్కువ ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
అత్యుత్తమమైన ఇంటీరియర్ (Interior):
మెర్సిడెస్-మేబ్యాక్ SL 680 మోనోగ్రామ్ సిరీస్ లోపలి భాగం విలాసవంతంగా ఉంటుంది. దీని లోపలి భాగం ప్రత్యేకంగా రూపొందించబడింది. AMG SL 63 మాదిరిగా కాకుండా... ఈ కారు రెండు సీట్ల సామర్థ్యాన్ని మాత్రమే కలిగి ఉంది. తెల్లటి లెదర్ సీట్లు.. మేబ్యాక్ లోగోలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. 12.3-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు 11.9-అంగుళాల సెంట్రల్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే డ్యాష్‌బోర్డ్‌లో ఉన్నాయి. అత్యాధునిక సాంకేతిక ఫీచర్లు, క్రోమ్ అలంకరణలు మరియు శబ్దం స్థాయిని తగ్గించే ఎగ్జాస్ట్ సిస్టమ్ కూడా ఉన్నాయి. సౌకర్యం కోసం సస్పెన్షన్‌ను కూడా మార్చారు.
శక్తివంతమైన పనితీరు (Powertrain):
మెర్సిడెస్-మేబ్యాచ్ SL 680 అనేది అద్భుతమైన పనితీరు కలిగిన కారు. 4.0 లీటర్ ట్విన్-టర్బో V8 ఇంజిన్‌తో 577 bhp శక్తిని మరియు 2,500 నుండి 5,000 rpm మధ్య 800 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా ఈ పవర్ నాలుగు చక్రాలకు చేరుతుంది. ఈ కారు కేవలం 4.1 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.. దీని గరిష్ట వేగం గంటకు 260 కిలోమీటర్లు. ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ కలిగి ఉన్న ఈ కారు.. రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేస్తూ ప్రయాణిస్తుంది.
ఈ మెర్సిడెస్-మేబ్యాక్ SL 680 మోనోగ్రామ్ సిరీస్ కేవలం ఒక వాహనం మాత్రమే కాదు..ఇది ఒక విలాసవంతమైన అనుభవం. పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉండటం వల్ల.. ఇది మరింత ప్రత్యేకమైనదిగా నిలుస్తుంది. ఈ కారు స్థిరత్వాన్ని మరియు స్మూత్ డ్రైవింగ్ అనుభవాన్ని కలిగిస్తుంది.
ఇది చదవండి: OPPO F29 5G- సూపర్ స్పీడ్, సూపర్ కెమెరా– అదరగొట్టే ఫీచర్లుతో..మరింత మెరుగైన పర్ఫార్మెన్స్!